కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు
17.11.26: మెదక్, నర్సాపూర్: నిన్న (16.11.26) రాత్రి సుమారు 08:10 గంటల సమయంలో NH-765D జాతీయ రహదారిపై నర్సాపూర్ - గుమ్మడిదల్ల అటవీ ప్రాంత పరిధిలోని కాసిల ఫార్మ్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, దౌల్తాబాద్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారం ముగించుకున్న ఐదుగురు వ్యక్తులు ఒక ఆటోలో తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపై ఎటువంటి హెచ్చరిక సూచికలు, ఇండికేటర్లు లేకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిప్పర్ లారీని ఆటో వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
మృతురాలి వివరాలు:
రాజిపేట రాములమ్మ, భర్త శంకరయ్య, వయస్సు 55 సంవత్సరాలు, వృత్తి: కూరగాయల వ్యాపారం.
గాయపడిన వారి వివరాలు:
1. రాజిపేట శంకరయ్య, వయస్సు 60 సంవత్సరాలు – తలకు మరియు శరీరంలోని కుడి వైపున తీవ్ర గాయాలయ్యాయి.
2. గండ్ల జీతయ్య, వయస్సు 57 సంవత్సరాలు – ఎడమ భుజంపై మరియు శరీరంపై గాయాలయ్యాయి.
3. వాలమల శోభారాణి, వయస్సు 48 సంవత్సరాలు – తలకు మరియు ముఖంపై గాయాలయ్యాయి.
4. జలిగామ బాలమణి, వయస్సు 52 సంవత్సరాలు – తలకు, చేతికి మరియు ముఖంపై గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రి, నర్సాపూర్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజిపేట శంకరయ్య మరియు వాలమల శోభారాణిని సూరారం నారాయణ ఆసుపత్రికి తరలించగా, గండ్ల జీతయ్య మరియు జలిగామ బాలమణి ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతురాలి మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటో పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ లారీ డ్రైవర్ ఎం.డి. సాబుల్ హుస్సేన్, తండ్రి మస్కందర్ అలీ, స్వస్థలం మణిపూర్ రాష్ట్రం, అని గుర్తించారు.
ఈ ఘటనపై నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.





Comments
Post a Comment