బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా

 జిల్లా పోలీస్ కార్యాలయం

మెదక్ జిల్లా


పత్రిక ప్రకటన

తేదీ: 20.08.2026


బాలికను వేధించిన నిందితుడికి మూడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా


నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని అభినంధించిన మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్

 బాలికను వేధిస్తూ, అసభ్యకరమైన ఫొటోలు పంపాలని కోరడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు తీర్పు వెలువరించిందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.

పూర్తి వివరాల ప్రకారం.. దాసరి స్వామి (26) అనే వ్యక్తి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఫోన్ నంబర్ ఇవ్వాలని తరచూ వేధించేవాడు. బాలిక స్నేహితుల వద్ద నుంచి ఆమె నంబర్ తీసుకుని ఫోన్ చేసి, పాఠశాల వద్దకు వస్తానని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడు. బాలిక అతడిని కలవకుండా ఇంటికి వెళ్లడంతో ‘‘నువ్వు రాకపోతే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా’’ అంటూ బెదిరించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇకపై బాలిక జోలికి రానని నిందితుడు రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు.

అయితే రెండేళ్ల తర్వాత వేసవి సెలవుల్లో మళ్లీ బాలికకు తన స్నేహితురాలిగా వాట్సాప్‌లో రెండు రోజులపాటు సందేశాలు పంపించాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు నగ్న చిత్రాలు పంపాలని కోరుతూ బాలికను వేధించాడు. 24-05-2024న బాలిక తండ్రికి ఫోన్ చేసి తన కుమార్తెను ఇంటికి పంపాలని, లేకపోతే ఆమె మేజర్ అయిన తర్వాత లేపుకుపోతానంటూ బెదిరించాడు.

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శివంపేట పోలీసులు అప్పటి ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావాలి నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.

కేసు దర్యాప్తు, కోర్టు వ్యవహారాల్లో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కృష్ణగౌడ్, సీడీఓ ఆనంద్ సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు