జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు. రాహుల్, సోనియా గాంధీ ప్రచారం చేసినా సంగారెడ్డిలో గెలవలేరు ఎమ్మెల్యే చింత ప్రభాకర్. జగ్గారెడ్డికి అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. జగ్గారెడ్డి రాజకీయాలు ప్రజలు తిరస్కరించారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్


 12.08.26: సంగారెడ్డి: జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పదేళ్ల క్రితం జరిగిన ఓ సమావేశాన్ని ఇప్పటికీ పదేపదే ప్రస్తావించడం జగ్గారెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని చింత ప్రభాకర్ అన్నారు. గత విషయాలనే తిరిగి తిరిగి చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ సభ కోసం రూ.6.5 కోట్లు అప్పు తెచ్చానని జగ్గారెడ్డి చెప్పడం ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటన సందర్భంగా ప్రభుత్వ హోదా లేని జగ్గారెడ్డి, ఆయన భార్యకు సీఎం వేదికపై చోటు దక్కకపోవడంతో ఏర్పడిన అసంతృప్తిని మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శల రూపంలో వ్యక్తం చేస్తున్నారని చింత ప్రభాకర్ ఆరోపించారు.

పాస్‌పోర్ట్ కేసుపై స్పందన

పాస్‌పోర్ట్ బ్రోకర్ కేసులో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకే చట్టపరమైన ప్రక్రియలో కేసు నమోదైందని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఇతరులపైకి మళ్లించే ప్రయత్నం చేయవద్దని జగ్గారెడ్డికి సూచించారు.

మున్సిపల్ పాలన, మెడికల్ కాలేజీపై విమర్శలు

జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని, పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారని, కొందరు జైలుకు వెళ్లారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో నిజాయితీ గురించి జగ్గారెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

సంగారెడ్డి మెడికల్ కాలేజీ విషయంలో కూడా జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫైల్ పెట్టానని చెబుతున్న జగ్గారెడ్డి, అప్పుడే ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

2018 ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరై ప్రారంభమైందని తెలిపారు. ప్రజల కళ్లముందు జరిగిన అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

తెలంగాణ ఉద్యమంపై వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి సమైక్యవాదానికి మద్దతుగా నిలిచారని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చింత ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ కోసం పోరాడుతుంటే జగ్గారెడ్డి భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు.

2018లో కేసు నేపథ్యంలో జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజలను కలిసి క్షమాపణలు కోరారని, ప్రజలు జాలితో అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంగారెడ్డి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

తాను 2018లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ సేవ చేశానని, కేసీఆర్, హరీష్ రావు సహకారంతో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. 2023 ఎన్నికల్లో ప్రజలు జగ్గారెడ్డి రాజకీయాలను తిరస్కరించి తనకు అవకాశం ఇచ్చారని, రాబోయే ఐదేళ్లు అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

"రాహుల్, సోనియా గాంధీ వచ్చినా గెలవలేరు"

జగ్గారెడ్డి ఇచ్చిన హామీలు చెప్పడానికి రోజులు సరిపోవని చింత ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ కాదు, స్వయంగా సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసినా సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.

సంగారెడ్డిలో ఎన్ని రాజకీయ కార్యక్రమాలు చేసినా తిరిగి గెలిచే అవకాశం లేదని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు మానుకుని అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జగ్గారెడ్డికి సవాల్ విసిరారు.

కాసాల బుచ్చిరెడ్డి విమర్శలు

ఈ సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలవకముందు జగ్గారెడ్డి అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని విమర్శించారు. గల్లీకో ఏటీఎం పెడతానని చెప్పి, తర్వాత "మా ప్రభుత్వం లేదు" అని చెప్పడం ప్రజలు మర్చిపోలేదన్నారు.

అధికారంలో లేకపోయినా మెడికల్ కాలేజీ తానే తీసుకొచ్చానని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ప్రజల దృష్టి మళ్లించడం తప్ప సంగారెడ్డి అభివృద్ధికి జగ్గారెడ్డి చేసిందేమీ లేదన్నారు.

హరీష్ రావుపై విమర్శలు చేసే ముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచిస్తూ, చిల్లర రాజకీయాలు మానుకుని సంగారెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి, లాడే మల్లేశం, జాఫర్, నాయకులు విష్ణు, కసిని శ్రీకాంత్, లాడే బాలు, అజీమ్, గోవర్ధన్ రెడ్డి, వాజిద్, దిలీప్, సంగమేశ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు