“మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారమయం” డి.ఎస్.పి ప్రసన్న కుమార్
మెదక్, ఆగస్టు 7: వికసిత్ భారత్ యువ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ అభియాన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), మెదక్లో శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. యూత్ ఐకాన్ మనోజ్ ఖన్న ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
ఈ సందర్భంగా యూత్ ఐకాన్ మనోజ్ ఖన్న మాట్లాడుతూ, “మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతుంది. మత్తుకు బానిస కావడం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది” అని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తమ విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్య అతిథి డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మెదక్ ప్రాంతంలో కల్లు చెట్లు తక్కువగా ఉన్నప్పటికీ కల్లు వినియోగం ఎక్కువగా ఉండటం ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లు వినియోగం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో పాటు అనేక సామాజిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలు కావద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం చివరకు కుటుంబ విచ్ఛిన్నానికి, ఆర్థిక నష్టానికి మరియు సామాజిక రుగ్మతలకు దారితీస్తుందని హెచ్చరించారు.
నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు, సినిమాలు మరియు కొన్ని సందర్భాల్లో సమాజంలోనే మత్తు పదార్థాల వినియోగాన్ని ఒక రకమైన ‘హీరోయిజం’గా చూపించడం సరైనది కాదని అన్నారు. యువతపై ఇటువంటి ప్రభావాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. 29 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన విద్యార్థులు యువ భారత్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకొని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ అవకాశాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకొని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం మరియు సమాజ భవిష్యత్తును కూడా కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ టి. మల్లేశం, డాక్టర్ ఆర్. శ్రీలత, శ్రీ మురళి వర్ధెల్లి, అధ్యాపకులు డాక్టర్ బి. శరత్ రెడ్డి, డాక్టర్ కె. నాగేంద్రరావు, డాక్టర్ వై. ప్రవీణ్ కుమార్, యూత్ వారియర్ పూనం రాజపురోహిత్తో పాటు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పించారు. “మత్తుకు దూరంగా ఉండండి – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.


Comments
Post a Comment