Rtd VRO, VAO లకు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం


 07.08.26: మెదక్: రెవెన్యూ మరియు పంచాయతీ రాజ్ శాఖల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వి.ఎ.ఓ., వి.ఆర్.ఓ., పంచాయతీ కార్యదర్శులు మరియు సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో 1965 నుండి 1984 వరకు పటేల్ పట్వారీలుగా, 1992 నుండి 2002 వరకు వి.ఎ.ఓ.లుగా, మరియు 2002 నుండి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులుగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి రిటైర్ అయ్యామని తెలిపారు. కానీ, ఇంతవరకు ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని, దీనిపై గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి, రిటైర్డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని సి.సి.ఎల్.ఎ (భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్) ను ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంతమంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉన్నారనే జాబితాను సిద్ధం చేసి పంపాలని సి.సి.ఎల్.ఎ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు.

కావున జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా వ్యాప్తంగా రిటైర్డ్ అయిన వి.ఎ.ఓ., వి.ఆర్.ఓ., పంచాయతీ కార్యదర్శుల సమగ్ర జాబితాను తయారు చేసి వెంటనే సి.సి.ఎల్.ఎకు నివేదిక పంపించాలని, తమకు పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు వి. రాములు, కె. గోపాల్ రావు, కె. పాండురంగారావు, బి. విట్టల్, ఎస్. మాణిక్య రెడ్డి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి, బి. రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు