దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలు, మార్పిడి, మరమ్మతులపై కఠిన చర్యలు ఉంటాయన్న అదనపు SP చైతన్య రెడ్డి
జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 08-08-2026
• మొబైల్ డీలర్లు, రిటైలర్లు, సెకండ్‌హ్యాండ్ మొబైల్ షాపులు, రిపేర్ సెంటర్ల నిర్వాహకులు CEIR పోర్టల్‌లో ముందస్తుగా IMEI వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపిఎస్.
*సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి:* దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ లేకుండా కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం లేదా మరమ్మతులు చేయడం చట్టరీత్యా నేరమని, అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని మొబైల్ ఫోన్ డీలర్లు, రిటైలర్లు, సెకండ్‌హ్యాండ్ మొబైల్ షాపులు, రిపేర్ సెంటర్లు, వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
*జిల్లా పోలీసు కార్యాలయం జారీ చేసిన నోటీసు ప్రకారం ప్రతి మొబైల్ ఫోన్ లావాదేవీలో కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి:*
• సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు, విక్రయించడం, మార్పిడి చేయడం లేదా రిపేర్ చేయడానికి ముందు CEIR పోర్టల్‌లో IMEI నంబర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. CEIR ద్వారా పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయవచ్చు.
• తమ వద్దకు వచ్చే ప్రతి మొబైల్ ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్‌ను నమోదు చేసి భద్రపరచాలి.
• మొబైల్ ఫోన్‌ను విక్రయించే వ్యక్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ఐడీ/పాస్‌పోర్ట్ వంటి ఫోటో గుర్తింపు పత్రం, అలాగే లైవ్ ఫొటోను తప్పనిసరిగా సేకరించాలి.
• అన్ని లావాదేవీలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, రిజిస్టర్‌ను భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తప్పనిసరిగా నిర్వహించాలి.
• బ్లాక్/బ్లాక్‌లిస్ట్ అయిన IMEI ఉన్న మొబైల్ ఫోన్లు, సరైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేని ఫోన్లు లేదా చోరీకి గురైనట్లు అనుమానం ఉన్న ఫోన్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ లావాదేవీలు చేయరాదు.
• అనుమానాస్పదంగా ఉన్న లేదా చోరీకి గురైనట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ లభించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ సెల్‌కు సమాచారం అందించాలి.
*చట్టపరమైన హెచ్చరిక*
• చోరీకి గురైన వస్తువులను తెలిసీ కొనుగోలు చేయడం లేదా తమ వద్ద ఉంచుకోవడం భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 317 కింద నేరంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 317(2) ప్రకారం చోరీ సొత్తును తెలిసీ స్వీకరించినా లేదా తమ వద్ద ఉంచుకున్నా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
• అదేవిధంగా, చోరీకి గురైన కమ్యూనికేషన్ డివైస్‌ను అది చోరీ సొత్తు అని తెలిసి లేదా తెలిసే కారణం ఉన్నప్పటికీ నిజాయితీ లేకుండా స్వీకరించడం లేదా తమ వద్ద ఉంచుకోవడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66B కింద నేరం. దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
• తనిఖీలు లేదా దర్యాప్తు సమయంలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు.
• మొబైల్ ఫోన్ వ్యాపారులు పోలీసు శాఖకు సహకరిస్తూ, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల చలామణిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు.



Comments
Post a Comment