సిగాచి బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాలి – ముఖ్యమంత్రికి TPJAC బహిరంగ లేఖ*
*సిగాచి బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాలి – ముఖ్యమంత్రికి TPJAC బహిరంగ లేఖ*
*సంగారెడ్డి జిల్లా సమస్యగా సిగాచి బాధితుల సమస్యను పరిష్కరించాలి*
14.08.26: సంగారెడ్డి : సిగచి ఇండస్ట్రీస్ ఘోర ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) సంగారెడ్డి జిల్లా కమిటీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖను విడుదల చేసింది.
సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లోని TPTF జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా, సిగాచి బాధిత కుటుంబాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బహిరంగ లేఖను విడుదల చేసినట్లు TPJAC జిల్లా కమిటీ తెలిపింది.
*1. రూ.1 కోటి పరిహారంలో రూ.58 లక్షలు ఇంకా పెండింగ్:*
సిగాచి ప్రమాదంలో బాధితులైన 54 కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1 కోటి పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని, ఇప్పటివరకు రూ.42 లక్షలు మాత్రమే అందాయని, మరో రూ.58 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని TPJAC తెలిపింది.
మిగిలిన రూ.58 లక్షలను వెంటనే విడుదల చేసి, 54 బాధిత కుటుంబాలకు ప్రకటించిన పూర్తి రూ.1 కోటి పరిహారం అందేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసింది.
*2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్‌గ్రేషియా వెంటనే ఇవ్వాలి:*
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా 11 మంది బాధితులకు, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియా 8 మంది బాధితులకు ఇంకా అందలేదని కమిటీ తెలిపింది.
3. EPF, EDLI ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న బాధితులకు, అలాగే 25 మంది బాధితులకు పెండింగ్‌లో ఉన్న ESIC/ESI ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరింది.
*4. ప్రమాదం తర్వాత కార్మికులను తొలగించడం అన్యాయం:*
ప్రమాదం అనంతరం కంపెనీలో పనిచేస్తున్న పలువురు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని, వారికి చట్టబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలు పూర్తిగా అందలేదని TPJAC ఆరోపించింది.
ప్రమాద సమయంలో కార్మికుల శ్రమతో సంస్థ లాభాలు పొందినప్పటికీ, ప్రమాదం తర్వాత వారిని వదిలించుకోవడం బాధ్యతారాహిత్యమైన చర్యగా కమిటీ పేర్కొంది.
కంపెనీ నుంచి తొలగించబడిన కార్మికుల వివరాలను సేకరించి, వారికి చట్టబద్ధంగా అందాల్సిన వేతన బకాయిలు, EPF, ESI మరియు ఇతర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. కంపెనీ తన బాధ్యతల నుంచి తప్పించుకోకుండా సంబంధిత కార్మిక శాఖ ద్వారా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
*4.తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ₹50 లక్షల పరిహారం ఇవ్వాలి:*
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ కుమార్ చౌదరి, సుష్మ, దివ్యలకు ప్రస్తుతం ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం సరిపోదని TPJAC పేర్కొంది.
వారి గాయాల తీవ్రత, భవిష్యత్తు వైద్య ఖర్చులు, ఉపాధి నష్టం, శారీరక–మానసిక వేదనను పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రిని కోరింది.
అలాగే ఉన్నత విద్యావంతులైన సుష్మ, దివ్యలకు వారి విద్యార్హతలకు తగిన విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మాస్యూటికల్ కంపెనీలలో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక సమీక్ష చేయాలి
సిగాచి ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా బాధితులు ఇంకా పరిహారాలు, ప్రభుత్వ సహాయం, చట్టబద్ధ ప్రయోజనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని TPJAC స్పష్టం చేసింది.
సిగాచి బాధితుల సమస్యను సంగారెడ్డి జిల్లా ప్రత్యేక సమస్యగా పరిగణించి, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అన్ని పెండింగ్ ప్రయోజనాలను నిర్ణీత గడువులోగా అందించేలా చర్యలు తీసుకోవాలని TPJAC కోరింది.
ఈ కార్యక్రమంలో TPJAC సంగారెడ్డి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్, కో-ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, కో-కన్వీనర్లు యం . చంద్రారెడ్డి,ఎస్ రామ కృష్ణ, కే చంద్రమోహన్ చారి, టి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)
సంగారెడ్డి జిల్లా

Comments
Post a Comment