జాతీయ సేవా పథకంలో ఆపదలో ఆదుకునే ఆపద మిత్రులం శిక్షణ పొందిన డిగ్రీ కళాశాల విద్యార్థులు
జాతీయ సేవా పథకంలో ఆపదలో ఆదుకునే ఆపద మిత్రులం శిక్షణ పొందిన డిగ్రీ కళాశాల విద్యార్థులు
23.09.26: మెదక్, నర్సాపూర్ : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం వాలంటీర్లు ఆపద సమయాల్లో ప్రజలను ఆదుకునే విధంగా నిర్వహించిన “యువ ఆపద మిత్ర” శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ మార్గదర్శనమ్లొ జాతీయ సేవా పథకానికి చెందిన 20 మంది వాలంటీర్లు ఈ నెల 16వ తేదీ నుండి 22 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కొండాపూర్ ఎనిమిదవ బెటాలియన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఆధ్వర్యంలో, రాష్ట్ర విపత్తు స్పందన దళం పర్యవేక్షణలో నిర్వహించిన *“యువ ఆపద మిత్ర”* శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడం, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అనేక కీలక అంశాలపై వాలంటీర్లకు నిపుణులచే సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు *ప్రాయోగిక శిక్షణ* అందించారు.
శిక్షణలో భాగంగా వాలంటీర్లకు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించే విధానం, చిన్నపిల్లలు మరియు పెద్దలకు అత్యవసర పరిస్థితుల్లో గుండె-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ నిర్వహించే పద్ధతులు, అగ్ని ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు వరదలు వంటి విపత్తుల సమయంలో సురక్షితంగా సహాయక చర్యలు నిర్వహించే విధానం, ప్రమాద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తాడు సహాయంతో రక్షణ చర్యలు చేపట్టే పద్ధతులు, నీటి ప్రమాదాల సమయంలో ఈత మరియు నీటి రక్షణకు సంబంధించిన మెళకువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
అదేవిధంగా విపత్తుల సమయంలో స్వీయ రక్షణ, బృంద సమన్వయం, బాధితులకు తక్షణ సహాయం అందించడం, ప్రమాద పరిస్థితులను అంచనా వేసి సమర్థవంతంగా స్పందించడం వంటి అంశాలపై కూడా వాలంటీర్లకు అవగాహన కల్పించారు.
ఏడు రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని కళాశాలకు తిరిగి వచ్చిన 20 మంది జాతీయ సేవా పథకం వాలంటీర్లను కళాశాల *వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి సమీరా నజ్మీన్,* *జాతీయ సేవా పథక ప్రోగ్రాం అధికారులు డా. బి. సురేష్ కుమార్, శ్రీనివాస్* మరియు అధ్యాపక బృందం అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా సామాజిక సేవ, విపత్తు నిర్వహణ, మానవతా దృక్పథం వంటి అంశాల్లోనూ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆపద సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే ప్రథమ చికిత్స, గుండె-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ, రక్షణ చర్యలపై శిక్షణ పొందడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
“ *సేవే లక్ష్యం – ఆపదలో సహాయమే ధ్యేయం* ” అనే స్ఫూర్తితో యువ ఆపద మిత్రులుగా శిక్షణ పొందిన జాతీయ సేవా పథకం వాలంటీర్లు, భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉంటారని కళాశాల ప్రోగ్రాం అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ సేవా పథక ప్రోగ్రాం అధికారులు డా. బి. సురేష్ కుమార్, శ్రీనివాస్, అధ్యాపకులు డా. అదెప్ప, అనిత, రవికుమార్, రమేష్, హేమంత్, మహేందర్ రెడ్డి, రాజు, రాము తదితరులు వాలంటీర్లను అభినందించి, శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సమాజ సేవలో అవసరం పడినప్పుడు సద్వినియోగం చేయాలని ఆకాంక్షించారు. వాలంటీర్లు కళ్యాణ్, ప్రభాకర్, కార్తీక్, అస్మా, ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment