రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం – నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అన్న *ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి**

16.10.26: మెదక్ , నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. నెలల తరబడి కష్టపడి పెట్టిన పెట్టుబడులు వృథా అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.


 ప్రస్తుతం కరెంట్ కోతలకు కారణాలేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని, విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.


తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు కీలకమైన సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, సరఫరాపై పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు. సింగరేణిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, సంస్థ వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు.


కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి, పెట్టుబడులు కోల్పోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.


 పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. కాలిపోయిన మోటార్లు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయించి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.


విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా అధికారులపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి రైతులకు సక్రమంగా కరెంట్ అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.


రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, ఎండిపోతున్న పంటలను కాపాడడం, నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 


రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు