దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధ పడుతూ..ఉరేసుకున్న యువకుడి మృతి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాబోదు అంటున్న పోలీసులు
28.10.26: మెదక్, నర్సాపూర్: పట్టణానికి చెందిన సురారం రమేష్ కుమార్ S/o సురారం యాదయ్య, వయస్సు 40 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మన్నె), వృత్తి: ప్రైవేట్ ఉపాధ్యాయుడు, స్వస్థలం: నర్సాపూర్ పట్టణం, మెదక్ జిల్లా, తేదీ 28.10.2026 తెల్లవారుజామున తన నివాసంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.
మృతుడు మొహమ్మదాబాద్లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సుమారు 15 సంవత్సరాల క్రితం సురారం సుష్మ (34)ను వివాహం చేసుకోగా, వారికి సురారం సాయి కుమార్ (10), వర్ణిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఫిర్యాదుదారుడు, మృతుడి తండ్రి సురారం యాదయ్య, తెలిపిన వివరాల ప్రకారం, రమేష్ కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఉపశమనం లభించలేదు. తేదీ 27.10.2026న విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం కూడా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు భార్యకు, తండ్రికి తెలిపాడు. ఆసుపత్రికి వెళ్లాలని తండ్రి సూచించగా, మరుసటి రోజు ఉదయం వెళ్తానని చెప్పాడు.
తేదీ 28.10.2026 తెల్లవారుజామున సుమారు 05:00 గంటలకు మృతుడి కుమారుడు సాయి కుమార్ నిద్రలేచి బెడ్రూమ్లో తన తండ్రి ఉరి వేసుకున్న స్థితిలో ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే పరిశీలించగా, అప్పటికే రమేష్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు. తన కుమారుడి మృతిపై ఎటువంటి అనుమానం లేదని, దీర్ఘకాలంగా వేధిస్తున్న కడుపునొప్పి కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు చట్ట ప్రకారం తదుపరి విచారణ చేపట్టారు.
నర్సాపూర్ పోలీసుల విజ్ఞప్తి: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేదా వైద్య నిపుణుల సహాయం పొందాలి. బాధలో ఉన్నవారికి ఆప్యాయతతో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
Case Registered by ఏ. రంజిత్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సాపూర్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా

Comments
Post a Comment