నిర్లక్ష్యంగా..అతివేగంగా కారు నడిపిన డ్రైవర్ కారణంగా ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

 

14.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణ పరిధిలోని న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో నిన్న (13.11.26)రాత్రి 11.15PM సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే, నర్సాపూర్ పట్టణం సంగారెడ్డి రోడ్ లోని న్యూ క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన మెదక్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ తాహెర్ (54), తన కుమారుడు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19)తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి మెదక్ బయల్దేరారు. ఈ క్రమంలో న్యూ క్లాసిక్ గార్డెన్స్ నుంచి సుమారు 30 మీటర్ల దూరంలో నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న కుమారుడు ఖాజా మొయినుద్దీన్ ఎడమ కాలు, ముఖం మరియు శరీరంపై తీవ్ర గాయాలతో రక్తస్రావానికి గురయ్యాడు. వెనుక కూర్చున్న తండ్రి మహమ్మద్ తాహెర్ తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అదే కారు అదుపు తప్పి కొద్దిదూరంలో వస్తున్న మరో ద్విచక్ర వాహనం (నంబర్ TS35B9507)ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనంపై ప్రయాణిస్తున్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన చిగురు ప్రదీప్ (27), తలారి నవీన్ (27) లు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ధరణి ఆసుపత్రికి, సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య సజీదా జబీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని కారు మరియు దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


పోలీసుల విజ్ఞప్తి:

  • వాహనదారులు రోడ్లపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అతివేగం, అజాగ్రత్త మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని గుర్తించాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడాలని SI రంజిత్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నా

    రు. 

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు