శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి విగ్రహ ధ్వంస నిందితులను కఠినంగా శిక్షించాలి అని విశ్వబ్రాహ్మణ, విశ్వ కర్మల నిరసన ర్యాలీ, పార్టీలకు అతీతంగా మద్దతుగా నిలిచిన నాయకులు
14.11.26: మెదక్, నర్సాపూర్: మెదక్ ప్రధాన రహదారిలోని చిన్న చింతకుంట బస్ స్టేజ్ సమీపంలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ చిన్న చింతకుంట బస్సు స్టేజ్ వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై.. ప్రధాన రహదారి మీదుగా నర్సాపూర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో విశ్వకర్మలు జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ ర్యాలీ నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరగా.. చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, H. రాజి రెడ్డి లు హాజరై ఈ నిరసన ర్యాలీకి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ పునఃప్రతిష్టకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని విశ్వకర్మ సంఘానికి హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మల మనోభావాలు దెబ్బతినేలా గుర్తుతెలియని వ్యక్తులు ఈ విధంగా పాల్పడటం సహించరానిదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకొని నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు నరసింహాచారి, కృపాచారి, నరేందర్ చారి సదానంద చారి, కాళిదాస్ చారి ప్రవీణ్ చారి, బ్రహ్మచారి, నరసింహ చారి, మురళీధర్ చారి, వెంకటేషా చారి, లింగం చారి, దయానంద్ చారి, ఇంకా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విశ్వకర్మ శారద పీఠాధిపతి చంద్రమౌళీశ్వర స్వామి, అఖిలభారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం, ఉపాధ్యక్షురాలు మంజుల, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చారి, రాష్ట్ర నాయకులు హనుమాన్ లు, రామచంద్రపురం రామ్మోహన్ చారి, నర్సాపూర్ సంఘ నాయకులు నరసింహ చారి, నరేందర్ చారి, మురళి చారి వెంకటేష్ చారి లింగం చారి, గజ్వేల్ సంగారెడ్డి మెదక్ కొల్చారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment